- పార్టీ భావజాలాన్ని గ్రామాలకు చేరుస్తున్న చంద్రమోహన్
- తూర్పుకాపులను పార్టీకి అనుసంధానించిన నాయకుడు
పార్టీ ఆరంభం నుంచే పవన్‌కళ్యాణ్‌కు అనేక మంది అభిమానులు ఉన్నా, అభిమానాన్ని రాజకీయ శక్తిగా మలచడం మాత్రం వేరే విషయం. పార్టీ భావజాలాన్ని అట్టడుగు స్థాయిలకు చేర్చడం కష్టసాధ్యమైన పని.
చంద్రమోహన్‌లో ఏ ప్రత్యేకత చూసిందో తెలియదు కానీ, "కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్టుగా" ఎక్కడైనా తిరిగి పార్టీకి బలాన్నిచ్చే పనిలో నిమగ్నమై ఉన్న ఆయనను, జనసేన జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. ఇది కాపు కోటాలో భాగంగా వచ్చిన పదవి అయినా, ఆయన నిరంతరం శ్రమిస్తూ పార్టీ బలోపేతం దిశగా ముందుకు వెళ్తున్నారు.
అభిమానాన్ని, భావోద్వేగాన్ని సమతుల్యం చేస్తూ, కొణెదల కుటుంబంలోని ఇతర హీరోల అభిమానులను కలుపుకొని, కూటమి పార్టీల నేతలతో సమన్వయం సాధిస్తూ, జనసేనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
పవన్‌కళ్యాణ్ లాంటి క్రౌడ్ పుల్లర్ ఉన్న సమయంలో, చంద్రమోహన్ లాంటి నాయకుడికి ఇంతటి ప్రాధాన్యం అవసరమా అనిపించొచ్చు. కానీ రాజకీయాల్లో భావజాలాన్ని పునాది స్థాయికి తీసుకువెళ్లడం అత్యంత క్లిష్టమైన పని. ఈ క్లిష్టతను స్పష్టతతో, కచ్చితత్వంతో ముందుకు తీసుకెళ్తున్నది చంద్రమోహన్.
జనసేనలో పిసిని చంద్రమోహన్ – తూర్పుకాపుల నాయకత్వం నుంచి జిల్లా అధ్యక్ష పదవి వరకు
తూర్పుకాపు ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ, వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్న సమయంలో, జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రస్తుత రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణెదల పవన్‌కళ్యాణ్ పిలుపుతో 2022లో పార్టీకి చేరిన వ్యక్తి పిసిని చంద్రమోహన్.
జర్నలిస్టుగా ప్రారంభమైన ఆయన ప్రయాణం, తూర్పుకాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించేందుకు దారి తీసింది. మొదటి నుంచీ కొణెదల కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉండటంతో, కుటుంబ సభ్యుల సూచనల మేరకు భీమవరం బహిరంగ సభలో జనసేన కండువా కప్పుకుని అధికారికంగా పార్టీలో అడుగుపెట్టారు.
చేరిన వెంటనే చంద్రమోహన్‌కు జనసేన రాష్ట్ర కార్యదర్శి పదవి అప్పగించగా, 2023 తెలంగాణ ఎన్నికలకు పార్టీ పరిశీలకుడిగా నియమించారు. ఆ తర్వాతి కాలంలో ఆయన చురుకైన పాత్ర పోషిస్తూ, పార్టీలో విశ్వసనీయతను పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన పనితీరును మెచ్చుకుని, 2023లోనే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన అధ్యక్ష పదవిని సార్వత్రిక ఎన్నికలకు ముందు అందజేశారు.
2024 ఎన్నికల్లో తూర్పుకాపులను మాత్రమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకొని "నూతన రాజకీయ వ్యవస్థ" కోసం ప్రజల్లో చైతన్యం నింపారు. ఎన్నికల తరువాత కూడా గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కంకణం కట్టుకొని ‘జెండా పండగ’ పేరుతో గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరణలు చేస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు.
గత జూలై 28, 29, 30 తేదీల్లో విశాఖలో జరిగిన జనసేన క్షేత్రస్థాయి నాయకుల సమావేశంలో చంద్రమోహన్ శ్రమ, పనితీరును పవన్‌కళ్యాణ్ స్వయంగా ప్రశంసించారు. ఆ సమావేశంలో ప్రకటించిన ‘త్రిశూల్ వ్యూహం’ ప్రకారం దసరా నుండి పార్టీ బలోపేతానికి తనదైన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.
కూటమి ప్రభుత్వం ప్రకటిస్తున్న నామినేటెడ్ పోస్టుల్లో, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని అన్ని వర్గాల జనసేన నాయకులకు సముచిత స్థానం దక్కేలా కృషి చేస్తున్నారు. ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూనే, మరోవైపు తూర్పుకాపు ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో ముందుకు నడిపిస్తూ, తూర్పుకాపుల హక్కుల కోసం పోరాటాన్ని జనసేన ఆవిష్కృత భావజాలానికి అనుసంధానం చేస్తున్నారు.
ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, సుడా చైర్మన్, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, రాష్ట్ర–జిల్లా కమిటీ అధ్యక్షులు, సభ్యులు, నామినేటెడ్ పదవులు పొందిన నాయకులను సమన్వయం చేస్తూ చంద్రమోహన్ ముందుకు సాగుతున్నారు.
జిల్లాలో అధిక జనాభా కలిగిన తూర్పుకాపులను బలంగా నడిపించడమే కాకుండా, కులాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకొని జనసేనను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
అందుకే, కుల రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ, పవన్‌కళ్యాణ్ ఇచ్చిన భరోసా, ప్రోత్సాహంతో పిసిని చంద్రమోహన్ పార్టీ లోపల, ప్రజల మధ్య విశ్వాసం గెలుచుకుంటూ ముందుకు సాగుతున్నారు.


