మన్ను పోతే ఏంటి .. మిన్నకుంటే పోలా..!

గార మండలంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

గార మండలంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు


వారికి నిబంధనల పట్ల ఎలాంటి గౌరవం లేదు. అనుమతులు తీసుకోవాల్సిన అవసరమే లేదన్న భావనతో సాగిపోతున్నారు. అధికార యంత్రాంగానికి భయపడటం అనే మాటే వినిపించదు. కన్ను పడితే చాలు — చెరువు గట్టు, మట్టి అన్న తేడా లేకుండా అక్రమంగా తవ్వేస్తారు, అమ్మేసుకుంటారు.

రాజకీయ నాయకుల అండదండలు, అధికారుల సహకారం ఈ అక్రమ వ్యాపారానికి ఇంధనంగా మారింది. మూడు పొక్లెయిన్లు, ఆరు టిప్పర్లతో ఈ వ్యవహారం యధేచ్చగా నడుస్తోంది. గార మండలంలో ఈ తవ్వకాలు పరాకాష్టకు చేరినా, అధికార యంత్రాంగం మాత్రం చూస్తూ నే నిలుస్తోంది. వీరి స్వేచ్ఛా వృత్తి ముందు పాలక వ్యవస్థ మౌనంగా నిలవడం ప్రశ్నార్థకంగా మారుతోంది.

గార మండలం, కొర్ని గ్రామ సచివాలయం వద్ద ఉన్న పోతల కోనేరులో చెరువు గట్టు మట్టిని రెండు పొక్లెయిన్లతో తవ్వించి, ఆ మట్టిని ఆరు లారీల్లో ఇటీవల అక్రమంగా తరలించారు. ఈ విషయం అధికారులకు తెలిసినా, వాహనాలను అడ్డుకుని తవ్వకాలను నిలిపడం మినహా, సంబంధిత వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

కొర్లాం గ్రామంలోని పెద్ద చెరువు, అస్థికం చెరువు, కొర్నిలోని పోతల కోనేరు, వాడాడ ఎబాజీఖాన్ చెరువుల గట్లను కూడా వారు ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. మండలంలోని అనేక ప్రాంతాల్లో ఇదే అక్రమ తవ్వకపు పరిస్థితి కొనసాగుతోంది.

కొంతమంది అక్రమార్కులు రాజకీయ నాయకులు, అధికారులను ప్రసన్నం చేసుకుని తమకు ఎవరూ అడ్డుకావన్న ధీమాతో పని చేస్తున్నారని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువులను నాశనం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఎవ్వరూ ప్రశ్నించడంలేదు…


జిరాయితీ భూములలోనైనా మట్టి తవ్వాలంటే, నిబంధనల ప్రకారం ముందుగా చలానా రూపంలో తగిన మొత్తం చెల్లించి, అనుమతులు తీసుకోవాలి. సంబంధిత పత్రాలు సరిగా ఉండినప్పుడే మట్టిని తరలించాల్సి ఉంటుంది. కానీ గార మండలంలో ఈ నియమాలు ఏవీ అమలవడం లేదు.

పట్టపగలే ఈ అక్రమం వ్యాపారంగా సాగిపోతున్నా, ఎవరూ ప్రశ్నించకపోవడంతో అక్రమార్కులు మరింత బలపడుతున్నారు. చెరువులను పరిరక్షించాల్సిన పంచాయతీ కార్యదర్శి, మట్టి రవాణాను అడ్డుకోవాల్సిన వీఆర్వో, ఉపాధి పనులను పర్యవేక్షించాల్సిన క్షేత్ర సహాయకులు, అలాగే జలవనరుల శాఖ అధికారులు — ఎవరూ జోక్యం చేసుకోవడం లేదు.

కొందరు స్థానికుల కథనం ప్రకారం, ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసినా అది తమ పరిధిలోకి రాదంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారని తెలుస్తోంది.

పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటాం...


అనుమతుల్లేకుండా మట్టి తవ్వకాలు జరపడం చట్టపరంగా నేరం. ఇప్పటివరకు మండలంలో ఎక్కడా, ఎవరికీ అధికారిక అనుమతులు మంజూరు చేయలేదు. ఎవరు నిబంధనలను అతిక్రమించి చర్యలు చేపడుతున్నా, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, చట్టబద్ధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Post a Comment