తగిన తనిఖీల లేకపోవడంతో ఆగడాలకు అడ్డుకట్ట వేయలేని పరిస్థితి
ఒడిశా రాష్ట్ర సరిహద్దు నుంచి శ్రీకాకుళం జిల్లాలోకి మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు మరియు ఇతర నిషేధిత వస్తువుల అక్రమ రవాణా ఉధృతంగా కొనసాగుతోంది. ఈ అక్రమాల నియంత్రణకు పటిష్ఠ తనిఖీ వ్యవస్థ లేకపోవడం వల్ల అక్రమార్కులు నిర్భయంగా అడ్డదారులు పట్టుతున్నారు. పాతపట్నం నుంచి ఇచ్ఛాపురం వరకు సుమారు 100 కి.మీ. పొడవున ఒడిశాతో జిల్లా సరిహద్దు ఉన్నప్పటికీ, రాకపోకలను పర్యవేక్షించేందుకు కేవలం మూడు ప్రాంతాల్లోనే తనిఖీ కేంద్రాలు ఉన్నాయి. ఇవి కూడా సమాచారం ఉన్నపుడే కార్యాచరణ చేపడుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్రమ రవాణా అడ్డుకోలేని స్థాయికి చేరింది.
ఒడిశా నుంచి శ్రీకాకుళం జిల్లా మీదుగా గంజాయి, నాటుసారా, పశువులు, కలప, ద్విచక్ర వాహనాలు, నకిలీ బిల్లులతో ఇసుక వంటి నిషేధిత పదార్థాల అక్రమ రవాణా విస్తృతంగా కొనసాగుతోంది. ఈ వస్తువులు జిల్లా పరిధిలో వినియోగమే కాక, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా తరలించబడుతున్నాయి. ఒడిశా రాష్ట్రానికి జిల్లా సరిహద్దుగా ఉన్న పాతపట్నం, కొత్తూరు, మెళియాపుట్టి, మందస, సోంపేట, ఇచ్ఛాపురం, కంచిలి మండలాల్లో 20కి పైగా ముఖ్యమైన రహదారి మార్గాలు ఉన్నాయి. అయితే, పాతపట్నం, పురుషోత్తపురం, పైడిభీమవరం వంటి మూడు చోట్ల మాత్రమే పోలీస్ తనిఖీ కేంద్రాలు ఉన్నాయి. మెళియాపుట్టి మండలంలోని వసుంధర వద్ద ఎక్సైజ్ శాఖ తనిఖీ కేంద్రం ఉంది. మిగిలిన మార్గాల్లో వాహనాల రాకపోకలు నిరంతరం కొనసాగుతున్నా, ఎటువంటి తనిఖీలు లేకపోవడం వల్ల అక్రమ రవాణా నిర్భయంగా జరుగుతోంది. దీని ద్వారా అక్రమార్కులు కోట్లాది రూపాయల లాభాలను పొందుతున్నారు.
గత రెండు సంవత్సరాల్లో అధికారులు 1,660 కిలోలకుపైగా గంజాయి పట్టుకొని, 21 వాహనాలను సీజ్ చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 130 మంది, రాష్ట్రానికి చెందిన 84 మందిని అరెస్టు చేశారు. అలాగే, 2,683 పశువులను పట్టుకుని, అక్రమ మద్యం రవాణాలో 1,042 మందిని అదుపులోకి తీసుకున్నారు.
అక్రమ రవాణాకు మార్గాలివే...
మెళియాపుట్టి మండలం: వసుంధర, గొప్పిలి, పట్టుపురం ప్రాంతాల్లో ముఖ్య రవాణా మార్గాలు ఉన్నాయి. ఇవి ఒడిశా రాష్ట్రంలోని పర్లాఖేముండి, భువనేశ్వర్ దిశగా పోతాయి. ఈ మార్గాల మీదుగా రోజూ వేలాది వాహనాలు సంచరిస్తున్నాయి. ఒడిశా నుంచి పలాస, ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్లకు, టెక్కలి జాతీయ రహదారి మీదుగా రవాణా కొనసాగుతోంది.
కొత్తూరు: మాతల – నివగాం – కొత్తూరు మార్గం ద్వారా ఒడిశా నుంచి సులభంగా ఆమదాలవలస రైల్వే స్టేషన్కు చేరుకుంటున్నారు. ఇది ముఖ్యమైన అక్రమ రవాణా మార్గంగా మారింది.
పాతపట్నం: పాతపట్నం, ఎ.ఎస్.కవిటి ప్రాంతాలు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ మార్గాల ద్వారా కొత్తూరు, హిరమండలం వరకు చేరడం సాధ్యమవుతోంది.
మందస: ఒడిశాలోని తుంబ కొండ ప్రాంతం నుంచి మందస మండలంలోని అంబటికంబారం, సింగుపురం మీదుగా పలాస, ఇచ్ఛాపురం, సోంపేట రైల్వే మార్గాల ద్వారా గంజాయి, నాటుసారా తరలిస్తున్నారు.
సోంపేట: ఒడిశాలోని పిరియాసాహి, కొంగాపూర్ ప్రాంతాల నుంచి సోంపేట మండలంలోని బాతుపురం, ఎంజీపురం, పొత్తంగి మార్గాల ద్వారా నాటుసారా అక్రమ రవాణా జరుగుతోంది.
ఇచ్ఛాపురం: టి.బరంపురం, పెద్దలక్ష్మీపురం, కొలిగాం, ముచ్చింద్ర మార్గాల ద్వారా ఇచ్ఛాపురం, పలాస రైల్వే స్టేషన్లకు మత్తు పదార్థాలు తరలిస్తున్నారు.
కంచిలి: భైరిపురం, కేశపురం ప్రాంతాల్లో చెక్పోస్టులు లేకపోవడంతో ఇక్కడి నుంచి గంజాయిని సోంపేట, పలాస రైల్వే స్టేషన్లకు తరలిస్తున్నారు.
ఈ మార్గాలు తనిఖీలకు అందకుండా ఉండటంతో, అక్రమ రవాణా ఆడుతూ పాడుతూ సాగుతోంది.
ముమ్మరం చేస్తాం...
సరిహద్దు రాష్ట్రం ఒడిశా నుంచి జిల్లాలోకి ప్రవేశిస్తున్న నిషేధిత పదార్థాలు, ఇతర అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఈ రకమైన చట్టవిరుద్ధ కార్యకలాపాలను అడ్డుకునేందుకు మరిన్ని తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రస్తుతం ఉన్న తనిఖీ కేంద్రాల్లో తనిఖీలను మరింత ముమ్మరం చేసి, దర్యాప్తు చర్యలను వేగవంతం చేస్తాం. అక్రమ రవాణాకు తావులేకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటాం.
