బెల్లుపడలో ఆధ్యాత్మిక సందడి..!

 ఇచ్ఛాపురంలో ఘనంగా రామనామ యజ్ఞాలు



న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం:
ఇచ్ఛాపురం పురపాలక సంఘ పరిధిలోని బెల్లుపడ గ్రామం మరోసారి ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే ఘృతయజ్ఞాలు, నామయజ్ఞాలు గ్రామానికి భక్తి పరిమళాలను విస్తరించనున్నాయి.

యజ్ఞ ప్రారంభ కార్యక్రమంగా బాహుదా నదిలో గంగపూజ నిర్వహించి, అక్కడి జలాలను కలశాలలో నింపి ఇళ్ల వద్ద పూర్ణకుంభాలు ఏర్పాటుచేస్తారు.
ఈ మహాయజ్ఞాలు చినజీయర్‌ స్వామి, ఆయన శిష్యుల ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. ఇందులో పాంచాహ్నిక పంచకుండాత్మక శ్రీరామతారకనామ ఘృతయజ్ఞం, అలాగే భక్తి ప్రచారక్‌ జ్యోతి మహారాజ్‌ ఆధ్వర్యంలో అష్టప్రహరీ రామనామ సంకీర్తన, నామజపయజ్ఞం విశేష ఆకర్షణగా నిలవనున్నాయి.

ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి 19 బృందాల భజగోవింద గోష్ఠి కళాకారులు హరినామసంకీర్తనలతో కార్యక్రమానికి మరింత వైభవాన్ని చేకూరుస్తారు. మందస వాసుదేవస్వామి దేవాలయం అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో క్రతువులు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమాల్లో భాగంగా ఏప్రిల్‌ 19 నుంచి 23 వరకు ప్రతిరోజూ ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు నారాయణసేవ (అన్నప్రసాద వితరణ) కొనసాగుతుంది. ఈసందర్భంగా విశాలమైన పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏప్రిల్‌ 24న పూర్ణాహుతి అనంతరం పూర్ణకుంభాలను బాహుదా నదిలో నిమజ్జనం చేయనున్నారు.

ఈ మహా యజ్ఞ మహోత్సవానికి హాజరై ఆధ్యాత్మికానందాన్ని పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు.

Post a Comment