న్యూస్టుడే, పాతబస్టాండ్, పలాస గ్రామీణం:
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం ప్రాధాన్యతను తెలియజేయడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ సాధికారిత శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో "పోషణ్ పక్వాడా" పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 8న ప్రారంభమైన ఈ అవగాహన కార్యక్రమాలు 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
పోషకాహార లోపంతో వచ్చే ఆరోగ్య నష్టాలను వివరించడంతో పాటు, గర్భిణుల ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు రూపొందించిన 1,000 రోజుల ప్రణాళికపై సూచనలు అందిస్తున్నారు. తగిన సమయంలో తగిన ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, తల్లి పాల ప్రాముఖ్యం, టీకాల షెడ్యూల్, చిరుధాన్యాల ప్రయోజనాలు, వంటల ప్రదర్శనలతో చక్కటి అవగాహన కల్పిస్తున్నారు.
వైద్యులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఐసీడీఎస్ సిబ్బంది కలిసి మహిళలు, బాలింతలకు పోషకాహారంపై వివరంగా తెలియజేస్తున్నారు. రక్తహీనత నివారణ, పరిశుభ్రత, కౌమార దశలో అవసరమైన జాగ్రత్తలు, సబలీకరణ చర్యలు ప్రధాన అంశాలుగా నిలుస్తున్నాయి.
“ఆర్థిక పరిస్థితుల కారణంగా పోషకాహారానికి దూరమవుతున్నవారికి దీనివల్ల అవగాహన కలుగుతోంది. అనారోగ్యంతో బాధపడే పిల్లలకు గుడ్లు, బాలామృతం, పోషకాహారం అందజేస్తున్నాం.”
– శాంతిశ్రీ, ప్రాజెక్టు డైరెక్టర్, ఐసీడీఎస్.
