సమాజ సేవకు పరిపూర్ణ నిధి.. సీవీఎన్ మూర్తి కన్నుమూత
గజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే:
సీవీ నాగజ్యోతి ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు సీవీఎన్ మూర్తి(82) మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తన కుమార్తె నాగజ్యోతి మృతి అనంతరం సమస్త ఆస్తిని సమాజసేవ కోసం అంకితం చేయాలని భావించిన ఆయన, రెడ్‌క్రాస్ సంస్థకు దానంగా ఇచ్చారు. అప్పటి నుంచి శ్రీకాకుళంలో ఉన్న సీవీ నాగజ్యోతి ఆనంద నిలయం (వృద్ధాశ్రమం) లోనే నివాసం ఉంటున్నారు.
జిల్లాలోని పలు దేవాలయాలకు వైభవవంతమైన విరాళాలు అందించిన మూర్తి, ధార్మికతకు, దాతృత్వానికి మారుపేరుగా నిలిచారు. ఆయన కోరిక మేరకు రెండు నేత్రాల నుంచి కార్నియా పొరలు సేకరించి భద్రపరిచారు.
బుధవారం రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహనరావు ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిపారు.
సేవే జీవితం అన్న సందేశాన్ని తన జీవితంతోే అందించిన మూర్తి మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
