ఆలివ్ రిడ్లేల సంరక్షణకు నడుంబిగించిన యువత
శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ అటవీ రేంజ్ల పరిధిలోని తీర ప్రాంతాల్లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, సోంపేట, కవిటి మండలాల్లో మొత్తం 16 తాబేళ్ల సంరక్షణ కేంద్రాలు (హేచరీలు) ఏర్పాటు చేశారు.
బుడగట్లపాలెం, దిబ్బలపాలెం, గుల్లవానిపేట, కుమందానివానిపేట, మేఘవరం, భావనపాడు, వజ్రపుకొత్తూరు, మెట్టూరు, గెడ్డూరు, బట్టిగళ్లూరు, బారువపేట, ఇసుకలపాలెం, కళింగపట్నం, బట్టివానిపాలెం, సీహెచ్ కపాసుకుద్ది, డొంకూరు ప్రాంతాల్లో ఈ కేంద్రాల ద్వారా తాబేళ్ల గూళ్లను రక్షిస్తూ, సముద్ర తాబేళ్ల జాతిని పరిరక్షించే కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు.
జిల్లాలో 193 కి.మీ. మేర విస్తరించి ఉన్న సముద్ర తీర ప్రాంతం ఇసుక తిన్నెలతో నిండి ఉండటంతో ఆలివ్ రిడ్లే తాబేళ్ల వృద్ధికి ఇది అత్యంత అనుకూలంగా మారింది. ఒడిశాలోని గహీర్మఠ తర్వాత ఈ ప్రాంతం ఈ తాబేళ్లకు పుట్టినిల్లు లాంటిదిగా అభివృద్ధి చెందింది. ప్రతి ఏడాది రణస్థలం నుంచి ఇచ్ఛాపురం వరకు విస్తరించిన తీర ప్రాంతాల్లో గుడ్లు పెట్టేందుకు వేల సంఖ్యలో తాబేళ్లు తరలివస్తాయి.
వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ తాబేళ్ల రక్షణను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా అటవీ శాఖతో పాటు ట్రీ ఫౌండేషన్ పర్యవేక్షణలో పలు తీర ప్రాంతాల్లో మత్స్యకార యువకులు హేచరీలు నిర్వహిస్తున్నారు. వారు వేల సంఖ్యలో గుడ్లను సేకరించి సంరక్షణ కార్యక్రమానికి తనవంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ చర్యలు ఆలివ్ రిడ్లే తాబేళ్ల జాతి పరిరక్షణకు ఎంతో దోహదపడుతున్నాయి.
పర్యావరణ హితుల పుణ్యఫలితం – అరుదైన తాబేళ్లకు రక్షణ కల్పన
శ్రీకాకుళం జిల్లాలోని తీరప్రాంతాల్లో అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు ప్రతి ఏడాది వందల సంఖ్యలో మృత్యువాత పడుతున్న సంగతి విదితమే. వాటి గుడ్లు పక్షులు, జంతువుల దాడులకు గురై పాడవుతున్నాయి. ఈ పరిణామాన్ని చైతన్యంతో గమనించిన తీర గ్రామాల మత్స్యకార యువకులు అటవీ శాఖతో కలిసి ముందడుగు వేశారు.
వాళ్లు ఏర్పాటు చేసిన హేచరీల పరిధిలో ప్రతి రాత్రి బ్యాటరీ దీపాలతో తీరప్రాంతాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. తాబేళ్లు ఇసుక గుంతల్లో గుడ్లు పెట్టి తిరిగి వెళ్లే వరకు నిశబ్ధంగా తీరానే వేచి ఉంటారు. ఆ గుడ్లను జాగ్రత్తగా సేకరించి కేంద్రాల్లో సంరక్షిస్తున్నారు. చిన్న తాబేళ్లు బయటకు వచ్చిన అనంతరం అధికారుల పర్యవేక్షణలో సముద్రంలోకి విడిచిపెడుతున్నారు.
ఈ ఏడాది కాశీబుగ్గ అటవీ రేంజ్ పరిధిలోని వజ్రపుకొత్తూరు, మెట్టూరు, బట్టిగళ్లూరు, బారువపేట, ఇసుకులపాలెం, కళింగపట్నం, బట్టివానిపాలెం, సీహెచ్ కపాసుకుద్ది హేచరీల వద్ద ఇప్పటి వరకు 1,861 తాబేళ్ల నుంచి సుమారు 2.11 లక్షల గుడ్లు సేకరించడమే కాకుండా జూన్ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.
ప్రకృతిని పరిరక్షించాలన్న తపనతో ముందుకొచ్చిన యువకులు నిజంగా పర్యావరణ రక్షకులే.
జీవవైవిధ్యానికి ముప్పు
శ్రీకాకుళం జిల్లాలో జీవవైవిధ్యం ప్రమాదంలో పడుతోంది. ఇంజిన్ బోట్లు, నిషేధిత వలల వలన రోజూ వందల సంఖ్యలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇది పరిసర సమతౌల్యానికి తీవ్రసంక్షోభాన్ని కలిగించే అంశంగా మారింది.
జిల్లా గుడ్ల సంరక్షణ కేంద్రాల సమన్వయకర్త సోమేశ్వరరావు మాట్లాడుతూ –
“ఈ అరుదైన జాతిని కాపాడాల్సిన అవసరం ఉంది. సామాజిక బాధ్యతగా భావించి అటవీశాఖ ప్రోత్సాహంతో పని చేస్తున్నాం. జనవరి నుంచి ఇప్పటివరకు 40 మంది యువకులు 2,437 తాబేళ్ల నుంచి 2,80,081 గుడ్లు సేకరించారు. అందులో 4,838 పిల్లల్ని సముద్రంలోకి విడిచిపెట్టాం” అన్నారు.
అటవీశాఖ రేంజ్ అధికారి మురళీకృష్ణనాయుడు మాట్లాడుతూ –
“సముద్ర తాబేళ్లు సముద్రంలోని నాచును తిని అధిక ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. ఇవి చేపలు పెడతాయనుకునే గుడ్లను నాశనం చేసే జెల్లీ ఫిష్ల నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే ఈ తాబేళ్ల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ట్రీ ఫౌండేషన్, మత్స్యకార యువకుల సహకారంతో పటిష్ఠ చర్యలు తీసుకున్నాం. యువకులు బాధ్యతగా ముందుకొచ్చి శ్రమిస్తుండటం అభినందనీయం” అన్నారు.
ఈ మహత్కార్యంలో యువత చొరవ చూపుతూ ప్రకృతిని పరిరక్షించడంలో భాగస్వాములవడమేగాక, సముద్ర జీవవైవిధ్యాన్ని భవిష్యత్తుకు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
