మీ ఆస్తి మీకిస్తారు..!

సర్వే చేస్తున్న అధికారులు
సర్వే చేస్తున్న అధికారులు 


ఎచ్చెర్ల, న్యూస్‌టుడే:


గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చిన ఇళ్లకు ఇంటిపన్ను మినహా ఎలాంటి హక్కుపత్రాలు లేకుండా ఉన్నారు. కొన్ని చోట్ల హక్కుపత్రాలు ఉన్నా, వాటిలో సర్వే నంబర్లు తప్పుగా ఉండటంతో ఆస్తులపై హక్కులు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా అన్నదమ్ములు, బంధువుల మధ్య తగాదాలు తలెత్తి ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం 2021లో ‘స్వామిత్వ సర్వే’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే అప్పటి వైకాపా పాలనలో సర్వే మొదలైనప్పటికీ నిధుల విడుదల ఆలస్యం కావడంతో ప్రక్రియ సాగలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ సర్వేను మళ్లీ ప్రారంభించి, ప్రతి మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో అమలు జరుపుతోంది. ఈ సర్వే పూర్తయితే అర్హులైన ప్రతి ఒక్కరికి యాజమాన్య హక్కుపత్రాలు లభిస్తాయి.

వైకాపా హయాంలో 30 మండలాల్లోని 1,465 రెవెన్యూ గ్రామాల్లో సర్వే ప్రారంభించి, 1,352 గ్రామాల్లో డ్రోన్ సర్వేను పూర్తిచేశారు.ప్రస్తుతం డ్రోన్ మ్యాపులు వచ్చిన 178 గ్రామాల్లో సర్వే కొనసాగుతోంది.
ఇంకా 271 గ్రామాల్లో ఇళ్లు, గ్రామ హద్దులు, ప్రభుత్వ భూముల సర్వే పూర్తయింది. ఇప్పటికే 124 రెవెన్యూ గ్రామాల్లో 22,496 మందికి కేంద్ర ప్రభుత్వం ఆస్తిపత్రాలు జారీ చేసింది.

ఈ సర్వేలో డ్రోన్ సాయంతో గ్రామ హద్దుల్లోని రహదారులు, భవనాలు, ఖాళీ స్థలాలు, చెరువులు, వాగులు, కొండలు, ప్రభుత్వ భూములు సర్వే చేసి వాటికి ఖచ్చితమైన హద్దులు నిర్ణయిస్తారు. ఇది పంచాయతీకి చెందిన ఆస్తుల స్పష్టతకు దోహదం చేస్తుంది. అనంతరం ప్రాపర్టీ కార్డులు జారీ చేయబడతాయి. ఈ కార్డులు రిజిస్ట్రేషన్‌, రుణాల కోసం ఉపయోగపడతాయి.

ప్రస్తుతం జిల్లాలో రీ-సర్వే జరుగుతున్న గ్రామాల్లోనే స్వామిత్వ సర్వేను కూడా సమాంతరంగా నిర్వహిస్తున్నారు. 25 మండలాల్లో 25 గ్రామాలను పైలట్ గ్రామాలుగా ఎంపికచేసి సర్వే కొనసాగిస్తున్నారు. ఎచ్చెర్ల మండలంలో ఐదు గ్రామాలపై దృష్టి సారించగా, ప్రస్తుతం జనిపినాయుడుపేట గ్రామంలో ప్రక్రియ సాగుతోంది.

మండలాల వారీగా సర్వే బృందాల ఏర్పాట్లు:

జిల్లాలో ఎంపికైన గ్రామాల్లో సర్వే సజావుగా సాగేందుకు రెవెన్యూ, సర్వే అధికారులతో సమావేశాలు నిర్వహించి శిక్షణ ఇచ్చారు. డ్రోన్లు, రోవర్ల ద్వారా సర్వే విధానం, అవసరమైన జాగ్రత్తలు, వివరాల యాప్‌లో నమోదు, ధ్రువీకరణ పత్రాల తయారీ వంటి అంశాల్లో అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, గ్రామ సర్వేయర్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, వీఆర్‌వోతో కూడిన బృందాలను సిద్ధం చేసి సర్వే ప్రారంభించారు.

ప్రతిఒక్కరికీ ప్రయోజనం:

కూటమి ప్రభుత్వం బాధ్యత చేపట్టిన తర్వాత, ఇప్పటివరకు 25 మండలాల్లో స్వామిత్వ సర్వే చేపట్టి, పలు గ్రామాల్లో హక్కుదారులకు ఆస్తిపత్రాలు అందజేశారు. ఈ సర్వే పూర్తయితే ప్రతి ఒక్కరికి ఇంటి యాజమాన్యంపై స్పష్టత కలిగి, చట్టబద్ధమైన పత్రాలు లభిస్తాయి.

Post a Comment